45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్‌.. బంక్‌ సిబ్బంది నిర్వాకం బయటపడిందిలా..!

  • కాన్పూర్‌లోని పెట్రోల్ బంకులో ఇంధన తారుమారు కలకలం
  • నిలదీసిన వాహనదారుడు.. సాకులు చెప్పిన బంక్ సిబ్బంది.
  • కారు కంపెనీ ప్రతినిధిని పిలిపించి ట్యాంక్ సామర్థ్యం నిరూపణ
  • మెషీన్లలో రీడింగ్ మార్చే చిప్‌లు వాడినట్లు అనుమానాలు
  • జిల్లా అధికారుల ఆధ్వర్యంలో బంకుపై ముమ్మర దర్యాప్తు
పెట్రోల్ బంకుల్లో సాగుతున్న మోసాలకు పరాకాష్ఠగా నిలిచే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. కేవలం 45 లీటర్ల సామర్థ్యం మాత్రమే ఉన్న కారు ట్యాంకులో ఏకంగా 52 లీటర్ల పెట్రోల్ కొట్టామంటూ బంక్ సిబ్బంది బిల్లు వేశారు. వాహనదారుడు నిలదీయడంతో ఈ నయా దగా బయటపడింది. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం సదరు పెట్రోల్ బంకుపై విచారణకు ఆదేశించింది.

ట్యాంకులో పెట్రోల్ ఉండగానే
కాన్పూర్‌కు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. కారు ట్యాంకులో దాదాపు 5 లీటర్ల పెట్రోల్ ఉండగా.. ట్యాంక్ ఫుల్ చేయించాలనే ఉద్దేశంతో ఆయన స్థానిక పెట్రోల్ బంకుకు వెళ్లాడు. సిబ్బంది కారులో ఇంధనం నింపిన తర్వాత ఇచ్చిన బిల్లు చూసి చరణ్ సింగ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అందులో ఏకంగా 52 లీటర్ల పెట్రోల్ కొట్టినట్లు ఉంది. కారు ట్యాంక్ కెపాసిటీయే 45 లీటర్లయినప్పుడు అది కూడా ట్యాంక్ పూర్తిగా ఖాళీగా లేనప్పుడు 52 లీటర్లు ఎలా పడుతుందని ఆయన బంక్ సిబ్బందిని గట్టిగా నిలదీశాడు.

రెండు విడతల డ్రామా
బంక్ సిబ్బంది ఆడిన డ్రామాను చరణ్ సింగ్ మీడియాకు వివరించాడు. మొదట మెషీన్‌ రీడింగ్‌లో 41 లీటర్లు అని చూపించగా ఆయన అనుమానంతో ప్రశ్నించాడు. దీంతో సిబ్బంది కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ.. పెద్ద మొత్తంలో ఇంధనం కొట్టేటప్పుడు రెండు విడతలుగా కొట్టాలని సాకులు చెప్పారు. ఆ తర్వాత మెషీన్‌ను రీసెట్ చేసినట్లు నటిస్తూ.. ట్యాంకులో ఎలాంటి పెట్రోల్ పోయకుండానే రీడింగ్‌ను మార్చేసి మరో 11 లీటర్లు అదనంగా కలిపి మొత్తం 52 లీటర్ల బిల్లు వేశారు.

కంపెనీ ప్రతినిధి ఎంట్రీ
ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న స్కామ్‌గా అనుమానించిన చరణ్ సింగ్ వెనక్కి తగ్గలేదు. అక్కడికక్కడే సదరు కారు తయారీ కంపెనీ ప్రతినిధిని బంకు వద్దకు రప్పించాడు. బంకుకు వచ్చిన కంపెనీ అధికారి.. సాంకేతికంగా ఈ కారు ట్యాంకులో ఎలాంటి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ పట్టదని లిఖితపూర్వకంగా స్పష్టం చేశాడు. దీంతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయిన బంక్ యాజమాన్యం నీళ్లు నమలడం ప్రారంభించింది.

అధికారుల అండతోనే మోసాలు?
స్థానిక కొలతలు, తూకాల శాఖ అధికారుల అండదండలతోనే ఈ పెట్రోల్ బంకు యాజమాన్యం ఇంతటి భారీ దగాకు పాల్పడుతోందని చరణ్ సింగ్ జిల్లా అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ మెషీన్లలో రీడింగ్‌లను మార్చేసేలా ఎలాంటి మోసపూరిత చిప్‌లను వాడారనే కోణంలో జిల్లా యంత్రాంగం, నిపుణుల కమిటీతో బంకులో తనిఖీలు చేస్తోంది.

Charan Singh
Kanpur
petrol pump fraud
fuel tank capacity
Uttar Pradesh
petrol pump scam
car fuel tank
fuel meter tampering
petrol bunk
meter scam

More Telugu News